: ఆంధ్రప్రదేశ్ ను ముగ్గురు బ్రోకర్లు పరిపాలిస్తున్నారు: రఘువీరారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన ముగ్గురు బ్రోకర్ల హస్తాల్లోకి వెళ్లిపోయిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. మంత్రి నారాయణ, ఎంపీ సుజనా చౌదరి, సీఎం రమేష్ లు తాను పేర్కొన్న ఆ ముగ్గురు బ్రోకర్లని ఆయన వ్యాఖ్యానించారు. వీరి ముగ్గురి కనుసన్నల్లోనే ప్రభుత్వ పాలన సాగుతోందని, వీరు చెప్పిందలా చేస్తూ చంద్రబాబు వీరి చేతిలో కీలుబొమ్మలా మారారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో వీరు ముగ్గురూ చంద్రబాబుకు డబ్బు సమకూర్చారని, అందుకే వారు చెప్పిన దానికల్లా చంద్రబాబు తలాడిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అంటూ విమర్శించిన చంద్రబాబు, ఈ ముగ్గురు బ్రోకర్లు చెప్పారని ఓ ప్రైవేటు కంపెనీకి పోలవరం ప్రాజెక్ట్ పనులు అప్పగించారని, నియమ నిబంధనలకు విరుద్ధంగా సదరు కంపెనీకి 200 కోట్లు అడ్వాన్స్ కూడా ప్రభుత్వం ఇచ్చిందని విమర్శించారు. జన్మభూమి వేదికగా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు రఘువీరా పిలుపునిచ్చారు.