: కొత్త రాజధాని నిర్మాణంలో ప్రవాసాంధ్రులు తోడ్పాటునందించాలి: మండలి బుద్ధప్రసాద్
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణంలో ప్రవాసాంధ్రులు తమ వంతు సహకారాన్ని అందించాలని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కృష్ణా జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులు ఢల్లాస్ లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు పెట్టేందుకు మంచి అవకాశముందని, ప్రవాసాంధ్రులకు ఇది సరైన తరుణమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనందించనుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రపంచ దేశాలు అబ్బురపడేలా కొత్త రాజధానిని నిర్మిస్తున్నామని, ఇందులో ప్రవాసాంధ్రులు తమ వంతు సహకారం అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. విజయవాడ కేంద్రంగా కొత్త రాజధానిని నిర్మిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నారని రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు.