: ఇవీ మంత్రి మండలి నిర్ణయాలు: బాబు
ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రేపు ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభిస్తామన్నారు. రుణాల నుంచి రైతులను విముక్తులను చేశామని అన్నారు. అనంతపురంలో అగ్రికల్చర్ మిషన్ ను అబ్దుల్ కలాం చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. వర్షాభావంతో కరవు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. బెల్టు షాపులను ఎత్తేస్తామని బాబు హామీ ఇచ్చారు. పట్టుదలతో పని చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తానని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ఆయన ప్రకటించారు. రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ సంస్థకు గ్రాంట్స్ రూపంలో నిధులు సమకూరుస్తామని తెలిపారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజలు, ఇతర మార్గాల ద్వారా నిధులు సేకరిస్తామని ఆయన వెల్లడించారు. రైతులకు రాయితీ ధృవీకరణ పత్రాలు అందజేసి నాలుగేళ్లలో రుణవిముక్తులను చేస్తామని ఆయన తెలిపారు. నకిలీ పాసు పుస్తకాల ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. భూమి రికార్డులు ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తామని ఆయన వివరించారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానించామన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఢిల్లీలో ఘాట్ ఏర్పాటు చేయాలని తీర్మానించినట్టు ఆయన స్పష్టం చేశారు. జన్మభూమి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని నిర్ణయించామన్నారు.