: చంద్రబాబుకు సత్య నాదెళ్ల ఫోన్!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఫోన్ చేశారు. భారత పర్యటనకు వచ్చిన సత్య నాదెళ్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కావడంతో పాటు హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయ సిబ్బందితోనూ సమావేశమయ్యారు. అనంతరం నేరుగా ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ జరిగిన నాస్కామ్ సదస్సుకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచే అమెరికాకు తిరుగుపయనమైన సత్య నాదెళ్ల, ఏపీ సీఎంకు ఫోన్ చేసి మాట్లాడారు. సమయాభావం వల్లనే మిమ్మల్ని కలవలేకపోతున్నానని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పలు అంశాలపైన చర్చ జరిగిందని, సంస్థ విస్తరణ కార్యకలాపాలపైనా వారిద్దరూ చర్చించుకున్నారని సమాచారం. మరోవైపు ఒకరి పనితీరుపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.