: ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు వెటర్నరీ విద్యార్థి దారుణం!
ప్రేమ మైకంలో నిండా మునిగిపోయిన ఓ వెటర్నరీ విద్యార్థి ఏం చేశాడో చూడండి. పోలెండ్ లోని ఓల్స్టిన్ సిటీలో ఉన్న వార్మియా అండ్ మాజురీ యూనివర్శిటీలో సదరు విద్యార్థి నాలుగో సంవత్సరం వెటర్నరీ సైన్స్ విద్య అభ్యసిస్తున్నాడు. ప్రియురాలిని ఇంప్రెస్ చేయడం కోసం 'ఐ లవ్ యూ' అన్న ఆంగ్ల పదాలను ఓ కుక్క పొట్టకు కుట్టేశాడు. ఆ ఇమేజ్ ను తన ప్రేయసి ఫేస్ బుక్ పేజిలో పెట్టాడు. దీనిపై అతని స్నేహితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదో వింత చేష్ట అని, అనైతిక చర్య అని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వారు యూనివర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అధికారులు సదరు ప్రేమికుడి విపరీత చర్యపై దర్యాప్తు మొదలుపెట్టారు. అందరూ అతగాడిని విమర్శించినా, అతడి గాళ్ ఫ్రెండ్ మాత్రం సమర్థించింది. అందులో అనైతికం ఏముందని ప్రశ్నించింది. అతడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడని పేర్కొంది. కాగా, కుక్క చర్మానికి ఆ అక్షరాలను కుట్టే క్రమంలో అతగాడు విచక్షణ రహితంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అవసరంలేని చోట కూడా ఎన్నో కుట్లేసినట్టు ఫొటోలు చెబుతున్నాయి.