: అనర్హులను తీసేయండి అనడం తప్పా?: పరకాల
అనర్హుల రేషన్ కార్డులను తీసేయండి అని చెప్పడమే తప్పా? అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయ విమర్శలు చేయలేదన్న విషయాన్ని ప్రతిపక్ష నేతలు గుర్తించాలని అన్నారు. తాను పేర్లు వెల్లడించిన నేపథ్యంలో, కొందరు భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. "మీకు తెల్ల రేషన్ కార్డు ఎలా వచ్చిందో తెలియకపోతే, మీరు తెల్ల రేషన్ కార్డుకు అనర్హులైతే మీ దగ్గర ఆ కార్డు ఉంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?" అని ఆయన ప్రశ్నించారు. తాను ప్రజలందరికీ ఈ ప్రశ్న వేస్తున్నానని, గ్రామాల్లో అనర్హులను గుర్తించాల్సిన బాధ్యత, ఆయా గ్రామాల పౌరులదేనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తగదని ఆయన చెప్పారు. అక్రమ రేషన్ కార్డులను తొలగించడానికి సహకరించి అర్హుల పక్షాన నిలుస్తారో, లేదా, రేషన్ కార్డులు యథాతథంగా ఉంచాలని పట్టుబట్టి అనర్హుల పక్షాన నిలుస్తారో... ప్రతిపక్ష నేతలే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. కటిక దరిద్రంలో పుట్టారా? ధనవంతులుగా పుట్టారా? అనేది ప్రశ్న కాదని, తెల్ల రేషన్ కార్డు ఉందా? లేదా? అనేదే ప్రశ్న అని ఆయన తెలిపారు.