: కుటుంబ సభ్యులను కాపాడేందుకు చిరుతతో కలబడ్డాడు!
ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి చిరుతపులితో పోరాడిన సంఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. పిథోరా గఢ్ ప్రాంతంలోని కమద్ గ్రామంలో నివసించే కేవ్లానంద అనే వ్యక్తికి ముగ్గురు సంతానం. ఆ రోజు అతని తల్లి బయటికివెళ్ళి, తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఓ చిరుతపులి కుక్కను తరుముకుంటూ వారి ఇంట్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో కేవ్లానంద భార్యబిడ్డలతో ఇంట్లోనే ఉన్నాడు. ఆ చిరుత పిల్లలపైకి లంఘించడంతో కేవ్లానంద వెంటనే దాన్నెదుర్కొనేందుకు సిద్ధపడ్డాడు. ఎలాంటి ఆయుధం లేకుండా దాంతో కలబడ్డాడు. తన చేతులకు, కాళ్ళకు, వీపు భాగానికి తీవ్ర గాయాలైనా, పావుగంట సేపు చిరుతతో కేవ్లానంద అలుపెరుగని పోరాటం సాగించాడు. ఇంతలో అతని కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. దీంతో, ఆ చిరుత కాస్తా అక్కడి నుంచి నిష్క్రమించింది. గాయపడిన కేవ్లానందను గోచార్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.