: మోడీకి అమెరికా కోర్టు సమన్లు జారీ
భారత ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. కొద్ది గంటల్లో అమెరికా గడ్డపై కాలుమోపనున్న మోడీకి న్యూయార్క్ కోర్టు ఈ సమన్లను జారీ చేసి సంచలనం సృష్టించింది. 2002 నాటి గోద్రా అల్లర్ల కేసుకు సంబంధించి న్యూయార్క్ దక్షిణ జిల్లా ఫెడరల్ కోర్టు నుంచి జారీ అయిన సమన్లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. అమెరికన్ జస్టిస్ సెంటర్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా జారీ అయిన ఈ సమన్లకు మోడీ 21 రోజుల్లోగా తన స్పందనను తెలియజేయాల్సి ఉంది. నిర్ణీత వ్యవధిలో మోడీ స్పందించని పక్షంలో ఆయనను డిఫాల్టర్ గా ప్రకటించే అవకాశముందని ఆ సమన్లలో కోర్టు వెల్లడించినట్టు తెలుస్తోంది. తన పర్యటన భారత్, అమెరికాల మధ్య కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ప్రకటించిన మోడీ, అమెరికా గడ్డపై కాలు మోపక ముందే ఈ సమన్లు జారీ కావడం గమనార్హం. ఫ్రాంక్ ఫర్ట్ లో కొద్దిసేపు ఆగే మోడీ, ఈ రోజు న్యూయార్క్ చేరుకుంటారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండే ఆయన ఈ నెల 29 న వాషింగ్టన్ వెళతారు.