: గూగుల్ అద్దాలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయట!
గూగుల్ అద్దాలు... టెక్నాలజీ సృష్టించిన మరో అద్భుతం. ఈ అద్దాలతో సెల్ ఫోన్ లో ఒక్కో అక్షరం వెతుక్కుంటూ మెస్సేజ్ లు టైప్ చేయక్కర్లేదు. నోటి వెంట వచ్చే మాటలను అది టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కూడా వీటిని ఉపయోగించవచ్చు. వినియోగదారులకు ఇది అత్యంత సౌలభ్యంగా ఉంటుందని ఉత్పాదకులు ప్రకటించారు కూడా. అయితే, గూగుల్ అద్దాల వాడకం అంత సేఫ్ కాదని ఓ అధ్యయనం చెబుతోంది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో గూగుల్ గ్లాస్ లు పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని... నియంత్రణ తక్కువ అవుతుందని తెలిపింది. బ్రేక్ వేయడంలో కూడా తొందరగా స్పందించలేకపోతున్నారని వెల్లడించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే 'జర్నల్ హ్యూమన్ ఫ్యాక్టర్స్' అనే సంచిక ప్రచురించబోతోంది.