: చెరువుల పరిరక్షణ ప్రచారం కోసం నేనూ పాట రాస్తా: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పరిరక్షణ ప్రచారం కోసం తానూ పాట రాస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అదే సమయంలో చెరువుల పునరుద్ధరణలో భాగంగా తట్ట మోస్తానని... తనతో పాటు మంత్రులు, కలెక్టర్లు కూడా తట్ట మోస్తారని చెప్పారు. హైదరాబాదులోని జేఎన్ టీయు ఆడిటోరియంలో ఇరిగేషన్ ఇంజినీర్లతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చెరువుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, చెరువుల వైభవం ప్రజలకు తెలియజేసేలా ప్రభుత్వం తరపున కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. కళాబృందాలతో చెరువుల పరిరక్షణపై వారోత్సవాలు నిర్వహిద్దామని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఇరిగేషన్ ను పట్టించుకోలేదని, చెరువుల పునరుద్ధరణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. అందుకే తమ ప్రభుత్వంలో రాబోయే నాలుగైదేళ్లలో ఇరిగేషన్ శాఖకు రూ. 50 వేల కోట్ల నుంచి రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.