: 'ఫాస్ట్' పథకంపై కోర్టులో మనం గెలవాల్సిందే: న్యాయశాఖకు కేసీఆర్ ఆదేశం
'ఫాస్ట్'లాంటి పథకాల వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని హైకోర్టు వ్యాఖ్యానించినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుంది. 'ఫాస్ట్'పై హైకోర్టులో మరింత సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు న్యాయశాఖను ఆదేశించినట్టు తెలిసింది. కౌంటర్లో బలమైన అంశాలు చేర్చాలని, లోటుపాట్లు లేకుండా, కోర్టు ఏకీభవించేలా బలమైన వాదనలు సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. దీంతో, 'ఫాస్ట్' పథకంపై కోర్టును ఎలాగైనా ఒప్పించేందుకు గాను సమర్థ వాదనలను సిద్ధం చేయడంలో న్యాయశాఖ అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. 1956కు ముందు నుంచి నివాసం ఉంటున్న వారికే పథకం వర్తిస్తుందని బలంగా చెప్పాలని, ఈ వాదనకు బలం చేకూర్చే అవసరమైన సమాచారం మిగతా శాఖలు న్యాయ విభాగానికి అందజేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. 'ఫాస్ట్' మార్గదర్శకాల రూపకల్పన బాధ్యత పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్దే కావడంతో కౌంటర్ తయారీలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. 'ఫాస్ట్' పథకానికి వ్యతిరేకంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ బుధవారం అధికారులను ఆరా తీశారు. 'ఎట్టి పరిస్థితుల్లోనూ మన వాదన నెగ్గాల్సిందే... తెలంగాణ ప్రభుత్వం గెలవాల్సిందే’ అని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. సీఎం ఆదేశాలతో అధికారులు దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసే పనిలో పడ్డారు.