: 'మార్స్' యాత్రలు ఎందుకు చేపడుతున్నారో తెలుసా?
ఏళ్లకు ఏళ్ళుగా కొన్ని దేశాలకు అంగారక గ్రహ యాత్ర సాధ్యం కావడంలేదు. అగ్రరాజ్యాలు సైతం ఎన్నో ప్రయత్నాల అనంతరం ఆ కలను సాకారం చేసుకోగలిగాయి. భారత్ మాత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయింది. అసలెందుకీ మార్స్ యాత్రలు? అంటే, మీథేన్ ను కనుగొనడం కోసమే అని ఆయా దేశాలు బదులిస్తాయి. మీథేన్... సహజవాయువులో ప్రధాన భాగమనే మనకు తెలుసు. సూక్ష్మజీవుల జీవక్రియల కారణంగా మీథేన్ విడుదల అవుతుంది. ఇది వాతావరణంలో కలుస్తుంది. అరుణ గ్రహంపై మీథేన్ ఆనవాళ్ళు కనుగొనగలిగితే అక్కడ సూక్ష్మ జీవుల ఉనికిపై స్పష్టమైన అవగాహనకు వచ్చే వీలుంటుందన్నది శాస్త్రవేత్తల భావన. తద్వారా, అక్కడ మనుగడ సాధ్యమేనా? అన్న అంశంపై పరిశోధనలకు ఊతం లభించినట్టవుతుంది. కాగా, నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై మీథేన్ లేదని ప్రకటించింది. ఈ సిద్ధాంతాన్ని ఇస్రో మాజీ చీఫ్ యు.ఆర్.రావు అప్పట్లో కొట్టిపారేశారు. దీనిపై ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంలో ఓ ప్రాంతంలోనే పరిశోధించిందని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో మీథేన్ ఉండే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. 'మామ్' ఈ విషయంలో అందించే సమాచారంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందని ఆయన తెలిపారు.