: నిర్మాతలతో పాటు మహేశ్ కూడా మా నష్టాల్ని పూడ్చాలి: 'ఆగడు' పంపిణీదారులు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘ఆగడు’ సినిమాను భారీ మొత్తం వెచ్చించి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ప్రస్తుతం లబోదిబోమంటున్నారని సమాచారం. ‘ఆగడు’ సినిమాకు మొదటి వారం పూర్తి కాకుండానే కలెక్షన్స్ పూర్తి స్థాయిలో డ్రాప్ అవటంతో, కోట్లాది రూపాయలు ఆఫర్ చేసి ఈ సినిమా పంపిణీ హక్కులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ గుండెల్లో రెళ్లు పరిగెడుతున్నాయనే వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. ఆగడు సినిమాకు వచ్చిన 'బ్యాడ్ టాక్' కారణంగా ఊహించని స్థాయిలో నష్టాలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతోందని... ఈ కారణంగా, తమ డబ్బును కొంత వెనక్కి ఇవ్వాలని పంపిణీదారులు నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. తమకు వచ్చిన నష్టాల విషయంలో 'ఆగడు' హీరో మహేశ్ బాబు కూడా జోక్యం చేసుకోవాలని బయ్యర్స్ పట్టుబడుతున్నట్టు సమాచారం. గతంలో, ‘బాబా’ సినిమా అట్టర్ ప్లాప్ అయినప్పుడు, రజనీ స్వయంగా కలగ చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు వచ్చిన నష్టాల్ని సెటిల్ చేసారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం, అదే రీతిలో మహేశ్ కూడా 'ఆగడు' విషయంలో కలుగజేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. తెలుగులో మహేశ్ లాంటి టాప్ హీరోలు ఇలాంటి పరిస్థితులలో కలగజేసుకోకపోతే, భవిష్యత్తులో అగ్ర హీరోల సినిమాలు కొనడానికి ఎవరూ ముందుకు రారని ‘ఆగడు’ డిస్ట్రిబ్యూటర్స్ గగ్గోలు పెడుతున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, మహేష్ ఈ వ్యవహారంలో తల దూర్చడానికి ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది.