: భారత క్రికెట్ గణాంక కురువృద్ధుడు ఆనంద్ జీ కన్నుమూత
భారత క్రికెట్ గణాంక నిపుణుల్లో అత్యంత పెద్ద వయస్కుడిగా పేరుగాంచిన ఆనంద్ జీ దొస్సా (98) కన్నుమూశారు. సెప్టెంబర్ 22న, అమెరికాలోని తన కుమార్తె నివాసంలో, నిద్రలో ఉండగానే ఆయన తుదిశ్వాస విడిచారు. దొస్సా మాజీ క్రికెటర్ కూడా. ముంబయి జట్టుకు రిజర్వ్ ఆటగాడిగా కొనసాగారు. 1954-55 సీజన్ లో పాకిస్థాన్ టూర్ కు రిజర్వ్ ఆటగాడిగా ఎంపికైనా, తన స్థానాన్ని మాధవ్ మంత్రికి కోల్పోయారు. ఈయన వికెట్ కీపర్. తొలినాళ్ళ నుంచి క్రికెట్ సంబంధ విషయాలపై ఎంతో పట్టున్న దొస్సా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి విరమించుకున్న తర్వాత గణాంక నిపుణుడిగా ప్రస్థానం ఆరంభించారు. 1987లో భారత్ లో 'క్రికెట్ గణాంక నిపుణులు, స్కోరర్ల సంఘం' స్థాపించగా, దొస్సా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1994-95 సీజన్ వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. 1998లో కుటుంబంతో పాటు అమెరికా వెళ్ళిపోయిన దొస్సా కొన్నాళ్ళకు భారత్ తిరిగివచ్చారు. ఆయన ఇద్దరు కుమార్తెలు మాత్రం అమెరికాలో స్థిరపడ్డారు. ముంబయిలో తమను చూసేవాళ్ళెవరూ లేకపోవడంతో దొస్సా రెండేళ్ళ క్రితం తన భార్యను తీసుకుని మరోసారి అమెరికా వెళ్ళారు.