: ఇబ్బంది పడ్డ ఇస్రో అధికారులను కన్విన్స్ చేసి వచ్చా: మోడీ
మామ్ ప్రయోగం విజయంతం అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించడాన్ని ప్రత్యక్షంగా చూడటానికి తాను బెంగుళూరు ఇస్రో కేంద్రానికి వస్తున్నట్టు పీఎంఓ ఆఫీస్ నుంచి బెంగుళూరు ఇస్రో కేంద్రానికి తొలుత సమాచారం అందిందని.... దీనికి ఇస్రో అధికారులు ''సార్, ఈ ప్రయోగం విజయవంతం అవ్వొచ్చు లేక విఫలం కావొచ్చు... ఒక వేళ ప్రయోగం విఫలమైతే, దేశ ప్రధాని సమక్షంలో ఇలా జరగడం మాకు ఇబ్బందిగా పరిణమిస్తుంది'' అని తనకు సమాచారమందించారన్నారు. దీనికి, తాను ఒకవేళ ఈ ప్రయోగం అపజయం పాలైతే... దేశ ప్రధానిగా వైఫల్యానికి తొలి బాధ్యత తనకు చెందుతుందని, ఆ సయయంలో శాస్త్రవేత్తలు నిరుత్సాహపడకుండా ధైర్యవచనాలు చెప్పడానికి తాను అక్కడ ఉంటానని... ఒకవేళ విజయవంతమైతే ఆ ఘనత ఇస్రో శాస్త్రవేత్తలకు దక్కుతుందని... అప్పుడు తన సమక్షంలో అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చని ప్రతి సమాధానం ఇచ్చానని మోడీ తెలిపారు. పేరులోనే మంగళ్ యాన్ ఉంది కాబట్టి... అంతా మంగళమే (శుభమే) జరుగుతుందని ఇస్రో అధికారులకు ధైర్యం నూరిపోశానని మోడీ అన్నారు. ఇలా, ఇస్రో అధికారులను కన్విన్స్ చేసి మామ్ ఆఖరి దశ ప్రయోగం కోసం బెంగుళూరు వచ్చానని మోడీ అన్నారు.