: రేవంత్ రెడ్డి చంద్రబాబు పెంచుతున్న కుక్క: టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేస్తున్న గొప్ప పనులు చూసి తట్టుకోలేక అసూయాద్వేషాలతో టీటీడీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. తెలంగాణ భవన్ లో పార్టీ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, జగదీశ్వర్, భూపాల్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపైనా, కేసీఆర్ పైనా చెప్పిందే చెబుతూ... అబద్ధాలను నిజం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి 'చంద్రబాబు పెంచుతున్న కుక్క' అని ఎంపీ బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పగలు ప్రెస్ మీట్ పెట్టడం... సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లి జోలె పట్టడం రేవంత్ నైజమని ఆయన ఆరోపించారు. 1999లో ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిన రేవంత్, ప్రస్తుతం కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం, రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలతో జూబ్లీహిల్స్ లో ఓ భవంతిని నిర్మిస్తున్నాడని... ఆ ఇంటిని ఏ కాంట్రాక్టర్ కట్టిస్తున్నాడో... వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలుసని బాల్క సుమన్ పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను, బడా పారిశ్రామికవేత్తలను రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేద్దామని రేవంత్ అనుకుంటున్నాడని.. కానీ, అది ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.