: కాశ్మీర్ వరదల సహాయక చర్యలపై మోడీ రాత్రింబవళ్లు పర్యవేక్షణ
ప్రధాని నరేంద్ర మోడీ, ఎంత ఉద్వేగంగా మాట్లాడతారో, ఏదైనా సమస్య వస్తే, దానిపై అంతే ఆసక్తిగా దృష్టి సారిస్తారు. ఆ సమస్య పరిష్కారమయ్యే దాకా విశ్రమించరు. జమ్ము కాశ్మీర్ వరదల నేపథ్యంలో మోడీలోని ఈ విలువైన గుణం వెలుగుచూసింది. కాశ్మీర్ వరదలు, వాటిలో చిక్కుకున్న ప్రజలకు అందుతున్న సహాయం, తదుపరి తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై మోడీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ విషయంలో ఆయన రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా అధికార వర్గాలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అసలు రాత్రి, పగలనే తేడా లేకుండా మోడీ పనిచేశారు. శ్రీనగర్ పట్టణం నీటిలో మునిగిన సందర్భంగా మోడీ ఆదేశాలతోనే ఒకేసారి 65 విమానాలు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వీలైంది. ఈ విషయాలన్నింటినీ ప్రధానిని నిత్యం వెన్నంటి ఉండే కేబినెట్ సెక్రటరీ అజిత్ సేథ్, ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.