: రాయుడి బిర్యానీ తినడానికి ధోనీ హోటల్ మారాడు!
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో భాగంగా హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ లీగ్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన సూపర్ కింగ్స్ ఆటగాళ్ళు గ్రాండ్ కాకతీయ హోటల్లో బస చేశారు. ధోనీతో సన్నిహితంగా మసలే యువ బ్యాట్స్ మన్ అంబటి రాయుడు ఈ సందర్భంగా భారత కెప్టెన్ కు హోమ్లీ ఆతిథ్యం ఇవ్వాలని భావించాడు. ధోనీ కోసమని తన ఇంట్లో బిర్యానీ చేయించి, దాన్ని కాకతీయ హోటల్ కు పట్టుకొచ్చాడు. అయితే, కాకతీయ హోటల్ నిబంధనలు మరోలా ఉన్నాయి. అక్కడ బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతించరట. ఇదే విషయాన్ని హోటల్ సిబ్బంది రాయుడికి చెప్పగా, రాయుడు ఈ సంగతి ధోనీకి వివరించాడు. దీంతో, ఒళ్ళు మండిన ధోనీ వెంటనే హోటల్ షిఫ్ట్ అవుతున్నట్టు స్పష్టం చేసి... తాజ్ కృష్ణాకు మకాం మార్చాడట. ధోనీ నిర్ణయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా సమర్థించినట్టు సమాచారం.