: ఫ్లైట్ లో లగేజ్ ను పోగొట్టుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో తన లగేజ్ బ్యాగ్ ను పోగొట్టుకున్నారు. ఆస్ట్రేలియా వెళుతుండగా మార్గమధ్యంలో ఇలా జరిగినట్లు ఆమె ట్విట్టర్ లో వెల్లడించారు. "సిడ్నీలో ల్యాండ్ అయి కైర్న్స్ వెళ్లే ఫ్లైట్ అందుకోబోతున్నాను. నా లగేజ్ లో ఉండాల్సిన బ్యాగ్ కనిపించలేదు" అని తెలిపారు. ఓ గంట తర్వాత మళ్లీ ట్వీట్ చేసిన ఆమె "కైర్న్స్ ఫ్లైట్ ఎక్కేందుకు రెడీగా ఉన్నాను. నేను ధరించాల్సిన అన్ని వస్త్రాలు కూడా పోగొట్టుకున్న సూట్ కేస్ లోనే ఉన్నాయి! అయితే కైర్న్స్ లో చీరలు కొనుక్కుంటానని చెప్పలేను! పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది" అని చెప్పారు. ఆ తర్వాత మాట్లాడిన ఎయిర్ ఇండియా మేనేజర్ మధు మాథెన్, మిస్ అయిన మంత్రి బ్యాగేజ్ ను గుర్తించామని, మరో ఆరు గంటల్లో అది కైర్న్స్ చేరుకుంటుందని వెల్లడించారు. కైర్న్స్ల్ లో జరిగే జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశాలకు హాజరయ్యేందుకు ఆమె వెళుతున్నారు.