: నేడు 14వ ఆర్థిక సంఘంతో తెలంగాణ సర్కారు భేటీ
తెలంగాణ సర్కారు నేడు 14వ ఆర్థిక సంఘంతో భేటీ కానుంది. గురువారమే హైదరాబాద్ చేరుకున్న సంఘం సభ్యులతో కేసీఆర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టిన కేసీఆర్, పలు పథకాల అమలు కోసం కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు విడుదలయ్యేలా సూచనలు చేయాలని అభ్యర్థించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావడంతో పన్ను మినహాయింపులు, కేంద్ర పన్నుల్లో మరింత వాటా, నిధుల కేటాయింపులో ప్రత్యేక కోటా తదితర అంశాలను ఆయన కమిటీకి వివరించినట్లు సమాచారం. తాజాగా, కేబినెట్ సహచరులు, అధికార గణంతో కలిసి నేడు ఆర్థిక సంఘంతో భేటీ కానున్న కేసీఆర్, పూర్తి స్థాయి ప్రతిపాదనలను వెల్లడించనున్నారు. తలసరి ఆదాయం లెక్కింపులో హైదరాబాద్ ను మినహాయించి, మిగిలిన జిల్లాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆయన ప్రధాన డిమాండ్ కు ఆర్థిక సంఘం ఎలా స్పందిస్తుందన్న అంశం నేటి భేటీలో కీలకం కానుంది.