: అప్పుల ఊబిలో రామ్ గోపాల్ వర్మ


నిత్యం వివాదాస్పద ప్రకటనల, వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ, తాజాగా అప్పుల ఊబిలో కూరుకుపోయి పత్తా లేకుండా పోయారట. దాదాపు రూ. 41 కోట్ల అప్పులతో గుక్కతిప్పుకోలేని స్థితిలోకి వెళ్లిన రామ్ గోపాల్ వర్మ, రుణదాతల కంటబడకుండా తిరుగుతున్నారట. నిన్నటిదాకా సినీ అభిమానులతో పాటు స్నేహితులు ఆయన జాడ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తే, తాజాగా అప్పులిచ్చిన వాళ్లు వర్మ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. వీరి బారి నుంచి తప్పించుకునేందుకు వర్మ, ఏకంగా ముంబైనే వదిలేసి హైదరాబాద్ కు మకాం మార్చినట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పుల తిప్పలు తప్పించుకునేందుకు, ముంబైలోని అంధేరీ కార్యాలయాన్ని కూడా ఆయన వదులుకునే అవకాశం లేకపోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన వద్ద రూ. 9 కోట్లు అప్పుగా తీసుకున్న వర్మ ఎక్కడున్నారో తెలియడం లేదని బాలీవుడ్ ఫైనాన్సియర్ భరత్ షా వాపోతున్నారు. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కు కూడా వర్మ, భారీగానే అప్పు పడ్డారు. తమ వద్ద రూ. 32 కోట్ల మేర అప్పు తీసుకున్న వర్మ, ఇప్పటిదాకా కేవలం రూ. 4 కోట్లు మాత్రమే చెల్లించారని ఆ సంస్థ సీఎఫ్ఓ శిబాషిస్ శంకర్ చెప్పారు. వర్మ నుంచి అప్పు వసూలు చేసుకునేందుకు కోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని శంకర్ తెలిపారు. మరి వర్మ, ఈ అప్పుల ఊబి నుంచి ఎప్పుడు, ఎలా బయటపడతాడో చూడాలి.

  • Loading...

More Telugu News