: భారత్ లో అమెరికా రాయబారిగా భారత సంతతి వ్యక్తి నియామకం


అగ్రరాజ్యం అమెరికా, భారత్ లో తమ రాయబారిగా భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మను నియమించుకుంది. అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన వర్మ, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి మేడలిన్ ఆల్ బ్రైట్ నేతృత్వంలోని ఆల్ బ్రైట్ స్టోన్ బ్రిడ్జీ గ్రూపునకు వ్యాపార సలహాదారుగా కొనసాగుతున్నారు. దౌత్యపర అంశాల్లో భారత్, అమెరికాల మధ్య ఇటీవల రేకెత్తిన వివాదాల నేపథ్యంలో భారత్ లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న న్యాన్సీ పోవెల్ ను తిప్పిపంపిన నాటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. తాజాగా ఆ పోస్టులో వర్మను నియమిస్తూ అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన అమెరికా పౌరుల్లో వర్మ రెండో వారు. జార్జీ టౌన్, లెహిగ్, అమెరికన్ వర్సిటీల్లో విద్యనభ్యసించిన వర్మ, అమెరికా జాతీయ భద్రత, అంతర్జాతీయ నియంత్రణ వ్యవహారాల్లో పేరు మోసిన న్యాయవాదిగా కొనసాగుతున్నారు. హిల్లరీ క్లింటన్ అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో కీలక బాధ్యతలు చేపట్టిన వర్మ, ఆ దేశ వైమానిక దళంలోనూ పనిచేశారు. ఇదిలా ఉంటే, అమెరికా విదేశాంగ శాఖలో ఆసియా, మధ్య ఆసియా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సహాయ మంత్రి నిషా దేశాయ్ బిశ్వాల్ కూడా భారత సంతతికి చెందిన అమెరికన్ కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News