: ఆ క్లాత్ పై 40 వేల వజ్రాలు... అది మొఘల్ కళానైపుణ్యం!
మొఘల్ చక్రవర్తి రాచరికానికి గుర్తుగా నిలిచే ఓ వస్త్రం లభ్యమైంది. నాటి హస్తకళా నైపుణ్యానికి గీటురాయిగా నిలిచిన ఆ వస్త్రంపై సుమారు 40 వేల వజ్రాలు పొదిగినట్టు దాని యజమాని వెల్లడించారు. వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన ఫాతిమున్నీసా బేగం అనే మహిళ తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న ఓ ముఖమల్ క్లాత్ ను గుర్తించింది. 'మొఘల్ క్లాత్ ఫర్ దుల్హన్' పేరిట పది తరాలుగా ఆ ముఖమల్ క్లాత్ తమ కుటుంబం వద్ద ఉంటోందని ఆమె వెల్లడించారు. అయితే, అనుమానం వచ్చిన ఫాతిమున్నీసా ఆ ముఖమల్ క్లాత్ ను బంగారం దుకాణంలో చూపించగా అవి వజ్రాలని నిర్ధారణ అయింది. దీంతో, హైదారాబాదులో స్థిరపడిన తమకు ప్రాణహాని ఉందని గుర్తించి స్వస్థలమైన చేర్యాలకు వచ్చేశారు. ముందుగా దీని గురించి ప్రాచుర్యం కల్పించి, ఆ తరువాత ప్రభుత్వానికి అప్పగించాలనుకుంటున్నామని ఆమె వెల్లడించారు. సుమారు 20 అడుగుల పొడవున్న ఈ ముఖమల్ క్లాత్ పై పువ్వుల ఆకారంలో వజ్రాలు పొదిగి ఉన్నాయని ఫాతిమున్నీసా తెలిపారు. ప్రతి పువ్వులో వెయ్యి వజ్రాల వరకు పొదిగి ఉన్నాయని ఆమె వివరించారు. అలాంటి పువ్వులు 40 ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. వజ్రాలే కాకుండా రంగుల పూసలు, కెంపులు, ముత్యాలు కూడా ఈ క్లాత్ పై ఉన్నాయని ఆమె తెలిపారు. దీనిని పోలీసుల సమక్షంలో ఎస్ బీహెచ్ లాకర్ లో భద్రపరిచారు. దీనిని త్వరలో తెలంగాణ ప్రభుత్వానికి అందజేయనున్నామని ఆమె స్పష్టం చేశారు. దీని ఖరీదు ఎంత ఉంటుందనేది ఇదమిత్థంగా తెలియలేదు... కానీ, కోట్ల లోనే ఉంటుందని సమాచారం.