: భారత టీనేజర్లకు 'ఫేస్ బుక్' ముఖ్య సూచన
ఆన్ లైన్ లో వేధింపులు, మోసాలు నానాటికీ పెరిగి పోతుండడంపై సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు యూజర్లలో చైతన్యం తెచ్చేందుకు ప్రచారం ప్రారంభించింది. ముఖ్యంగా భారత టీనేజర్ల కోసం హిందీ, గుజరాతీ, బెంగాలీ వంటి తొమ్మిది భాషల్లో ప్రచారం చేస్తోంది. 'థింక్ బిఫోర్ యు షేర్' పేరిట ఈ ప్రచారం సాగించనున్నారు. పోస్టు చేసేముందు, ఆలోచనలు, ఫొటోలు పంచుకునే ముందు టీనేజర్లు కాస్త ఆలోచించాలని ఫేస్ బుక్ సూచించింది. ఆన్ లైన్లో తలెత్తే సామాజిక సమస్యలను ఎదుర్కోవడంపైనే గాకుండా, వాటిని ఎలా వెల్లడించాలన్న విషయాన్ని కూడా ఫేస్ బుక్ తన ప్రచారంలో వివరించనుంది. సరైన ప్రైవసీ సెట్టింగ్స్ లేకపోతే సదరు టీనేజర్ షేర్ చేసిన సమాచారాన్ని కొందరు దుర్వినియోగ పరిచే అవకాశముందని ఈ సోషల్ నెట్వర్క్ హెచ్చరించింది. ఫిర్యాదుల కోసం సోషల్ రిపోర్టింగ్ టూల్ ను కూడా ఫేస్ బుక్ ప్రవేశపెట్టనుంది. ఫేస్ బుక్ లో ఎవరైనా అసౌకర్యంగా ప్రవర్తిస్తున్నా, అనుమతి లేకుండా ఫొటోలు ట్యాగ్ చేస్తున్నా, అదే పనిగా వేధిస్తున్నా ఈ టూల్ ద్వారా ఫేస్ బుక్ కు రిపోర్టు చేయవచ్చు. అప్పుడు, ఫేస్ బుక్ తగిన చర్యలకు శ్రీకారం చుడుతుంది. ఫిర్యాదు చేసిన వెంటనే... ఎవరైనా పెద్దలుగానీ, నమ్మకస్తులుగానీ ఈ విషయంలో జోక్యం చేసుకోవచ్చా? అని ఆ టీనేజర్ కు సందేశం వస్తుందట. ఓకే చెబితే, ఆ దిశగా ఫేస్ బుక్ ప్రయత్నాలు మొదలుపెడుతుందన్నమాట. తల్లిదండ్రులను, టీచర్లను కూడా ఫేస్ బుక్ సదరు సమస్యపై అప్రమత్తం చేస్తుంది. ఇష్యూను ఎలా పరిష్కరించాలన్న విషయమై మార్గదర్శనం చేస్తుంది.