: మెట్రో రైలు పనులు సాఫీగా జరుగుతాయి: మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాదులో మెట్రో రైలు పనులు సాఫీగానే జరుగుతాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ప్రభుత్వం, ఎల్ అండ్ టీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉంటాయని, సాధారణమేననీ అన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను మెట్రో రైలు ఎండీ కొద్దిసేపటి కిందట కలిశారు. అనంతరం మీడియాతో పైవిధంగా మాట్లాడారు. మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి వైదొలగుతామని, తమ ఖర్చులు తిరిగి ఇచ్చేయాలని పేర్కొంటూ, హైదరాబాదు మెట్రో రైల్ లిమిటెడ్ వైఖరిపై ఎల్ అండ్ టీ కినుక వహిస్తూ లేఖ రాసినట్లు కథనాలు వచ్చాయి. వీటిపై మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పైవిధంగా స్పందించారు.