: జగన్ భద్రత కుదింపు... ఎవరి వాదన నిజం?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత విషయంలో రెండు భిన్న వాదనలు వెలుగు చూశాయి. తనకు భద్రత కుదించారని స్వయంగా జగన్, హైకోర్టును ఆశ్రయించగా, అబ్బే అలాంటిదేమీ లేదని, ఆయనకు ఏమాత్రం భద్రత తగ్గించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణనిచ్చింది. అసలు ఈ రెండు వాదనల్లో ఏది నిజం? జెడ్ కేటగిరీ భద్రతలో కొనసాగుతున్న ప్రముఖులకు భద్రత కుదించడం కాని, తొలగించడం కాని చేయాలనుకుంటే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా ఆయా ప్రముఖులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. జగన్ భద్రతపై మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే ప్రభుత్వం ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే జగన్ కు భద్రత కుదించిందని ఆయన తరఫు న్యాయవాది సీతారామమూర్తి సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా, జగన్ కు కొనసాగిస్తున్న జెడ్ కేటగిరీ భద్రతను ఏమాత్రం కుదించలేదన్న ఏపీ అడ్వొకేట్ జనరల్ వేణు గోపాల్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అయినా, భద్రత తగ్గకుండానే, జగన్ ఎందుకు కోర్టును ఆశ్రయిస్తారన్న అనుమానం ఇక్కడ రేకెత్తుతోంది. ఈ నెల 13 నుంచి తనకు భద్రతగా పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య తగ్గిపోయిందట. చెప్పాపెట్టకుండానే కొందరు విధుల నుంచి జారుకున్నారట. మరి ప్రభుత్వ ఆదేశాల మేరకే వారు విధులకు దూరమయ్యారా? లేక సొంతంగానే విధులకు గైర్హాజరవుతున్నారా? అన్న విషయం తేలితే కాని, ఈ విషయంలో స్పష్టత వచ్చేలా లేదు.