: చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య జరిగిన 'హీరో' పోరులో చంద్రబాబుదే విజయం!
'హీరో'ను సాధించాలని ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య జరిగిన రసకందాయ పోరులో ఆఖరుకు ఏపీ సీఎం చంద్రబాబే విజయం సాధించారు. దక్షిణాదిన తమ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు హీరో సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో దోబూచులాడింది. హీరో సంస్థ దక్షిణాదిలో తమ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించగానే... ఏపీ సీఎం చంద్రబాబే నేరుగా రంగంలోకి దిగారు. హీరో మోటో కార్ప్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి.. ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్ ఏర్పాటు చేస్తే సకల సౌకర్యాలు కల్పిస్తామని.. పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాల వలన తొలుత ఏపీలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు హీరో సంస్థ మొగ్గుచూపింది. అయితే...ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. తన వంతు ప్రయత్నాల్లో భాగంగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రను రంగంలోకి దింపింది. అప్పట్లో ప్రదీప్ చంద్ర దీని కోసం ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి హీరో కంపెనీ సీవోవో విక్రమ్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలోని వసతులపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ తర్వాత తెలంగాణలో తమ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు హీరో సంస్థ సంసిద్ధత కూడా వ్యక్తం చేసింది. దీంతో, కేసీఆర్ నెల రోజుల పాలన పూర్తయిన సందర్భంగా చానళ్లు, పత్రికలు... ప్రతిష్ఠాత్మకమైన హీరో ప్రాజెక్ట్ ను సాధించడం ద్వారా కేసీఆర్ చంద్రబాబుపై పైచేయి సాధించారని ఆయనపై ప్రశంసలు కురిపించాయి. అయితే... ఇక్కడి నుంచి చంద్రబాబు చాణక్యం మొదలైంది. హీరో దక్షిణాదిలో తన తొలి ప్రాజెక్ట్ ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ చంద్రబాబు తన ప్రయత్నాలు మానలేదు. చాప కింద నీరులా...ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే, మొన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా హీరో సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ తో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో ఆంధప్రదేశ్ లో తమ ప్లాంట్ ను ఏర్పాటు చేసేలా 'ఫైనల్ టచ్' చంద్రబాబు ఇచ్చారు. దీంతో, ఆంధ్రప్రదేశ్ తన తొలి భారీ పరిశ్రమను సాధించింది. చంద్రబాబు మంత్రాంగం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఊగిసలాడిన హీరో చివరకు ఆంధ్రప్రదేశ్ నే ఎంచుకుంది. దీని కోసం చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ సెజ్ సమీపంలో 600 ఎకరాలు హీరోకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు, ఒప్పందం కుదుర్చుకోవడానికి హీరో సంస్థ ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 3 వేల మందికి ప్రత్యక్షంగా...మరో 3వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది.