: కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న భారత క్రికెటర్ రసూల్ క్షేమం!
జమ్ము కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న టీమిండియా జట్టు సభ్యుడు పర్వేజ్ రసూల్ క్షేమంగా బయటపడ్డాడు. వరదల నేపథ్యంలో దాదాపు 11 రోజులుగా రసూల్ జాడే లేదు. దీంతో అతడు వరదల్లో ఏమైపోయాడోనని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అనంతనాగ్ జిల్లాలోని బిజ్ బెహారాలోని తన ఇంటిలో తొలి అంతస్థులో కుటుంబంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన రసూల్, 11 రోజుల తర్వాత ‘‘నేను క్షేమంగానే ఉన్నాను. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అంటూ సందేశం పంపాడు. ఈ సందర్భంగా వరదల్లో తాను, తన కుటుంబం ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను రసూల్ వెల్లడించాడు. వరదలు ముంచెత్తిన నేపథ్యంలో తమ ఇంటిలోని కింద ఫ్లోర్ లోకి నీరు చేరిపోవడం ప్రారంభం కాగానే, కుటుంబ సభ్యులతో కలసి తొలి అంతస్థుకు చేరాడు. ఫోన్ చేద్దామంటే మొబైల్ పనిచేయడం లేదు. ఇంటర్నెట్ కనెక్టివిటీ కట్ అయిపోయింది. దీంతో 11 రోజులుగా క్షణమొక యుగంలా కాలం వెళ్లదీశాడు. ఎట్టకేలకు వరద ప్రవాహం తగ్గడంతో సహాయక బృందాల సహకారంతో కుటుంబం సహా బయటపడ్డాడు. ప్రమాదం నుంచి బయటపడగానే, తనలాగే వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాడు రసూల్.