: ఏపీలో నిరంతర విద్యుత్ వెలుగులపై నేడే ఒప్పందం!
ఆంధ్రప్రదేశ్ లో నిరంతర విద్యుత్ సరఫరాకు సంబంధించిన అంశంపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర సర్కారు నేడు ఒప్పందం చేసుకోనుంది. ఒప్పంద పత్రాలపై కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శులు సంతకాలు చేయనున్నారు. హైదరాబాద్ లోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ల సమక్షంలో ఈ ఒప్పందం కుదరనుంది. ఒప్పందంపై కేంద్రం, రాష్ట్రాలు సంతకాలు చేయడంతో ఏపీలో నిరంతర విద్యుత్ సరఫరాకు దాదాపు రంగం సిద్ధమైపోయినట్లే. అక్టోబర్ 2 నుంచి ఈ ఒప్పందం అమలులోకి రానుంది. ఇందులో భాగంగా ఏపీలో గృహ, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి కోతలు అమలు కావు. వ్యవసాయానికి కూడా నిర్ణీత వేళల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా కానుంది. నిరంతర విద్యుత్ సరఫరా ఒప్పందం సందర్భంగా మరో రెండు ఒప్పందాలపై కేంద్రం, రాష్ట్రం, విద్యుదుత్పత్తి సంస్థలు సంతకాలు చేయనున్నాయి. విశాఖ ధర్మల్ విద్యుత్ ప్లాంట్, అనంతపురం జిల్లాలో సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాట్లపై ఈ ఒప్పందాలు జరగనున్నాయి.