: మద్యం మత్తులో హైదరాబాద్ రోడ్లపై యువతి ర్యాష్ డ్రైవింగ్
మద్యం మత్తులో ఉన్న ఆ యువతి సోమవారం రాత్రి హైదరాబాద్ రోడ్లపై హల్ చల్ చేసింది. మద్యం నిషా నషాళానికంటిన ఆ యువతి చేతిలోని కారు పలువురిని గుద్దుకుంటూ ముందుకెళ్లింది. అయినా ఆ మహిళ కారును ఆపకుండానే ముందుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు కొద్దిపాటి శ్రమతో కారును నిలిపేసి యువతిని స్టేషన్ కు తరలించారు. విచారణలో భాగంగా యువతి పేరు షహనాజ్ గా తేలింది. ఆమెకు ఇదేమీ కొత్త కాదని, గతంలోనూ పలుమార్లు ఇదే రీతిన మద్యం మత్తులో కారు నడిపి పలువురిని గాయపరిచిందని తేలింది. సోమవారం రాత్రి ర్యాష్ డ్రైవింగ్ లో షహనాజ్, ఇద్దరిని గాయపరిచింది. మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పై వలపన్నిన పోలీసులు ఎట్టకేలకు షహనాజ్ ర్యాష్ డ్రైవింగ్ కు బ్రేకులేశారు. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి, సోదాలు చేయగా, షహనాజ్ కారులో మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో పోలీసులు కంగుతిన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో ఆమె చేసిన ప్రమాదాలను వెలికి తీస్తున్నారు.