: రెడ్ లైట్ జంప్ చేశారో రూ. 5 వేలు కట్టాల్సిందే!
ట్రాఫిక్ పోలీసు చూడట్లేదు కదా అంటూ రెడ్ లైట్ జంప్ చేశారో, అక్కడిక్కడే రూ.5 వేలు చెల్లించాల్సిందే. ఇదే తప్పిదాన్ని మళ్లీ చేశారంటే, ఈసారి రూ.10 వేలు వదులుకోవాల్సి వస్తుంది. మళ్లీ ఇదే పొరపాటు చేస్తే, ఈ సారి రూ.12.5 వేలతో పాటు ఓ ఎనిమిది వారాల పాటు మీ లైసెన్స్ రద్దు చేసుకోక తప్పదు. అంతేకాదు, డ్రైవింగ్ లో మరోమారు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అదీ రవాణా శాఖ నిర్వహించే ప్రత్యేక శిక్షణ శిబిరాల్లో సుమా. కేంద్రం తాజాగా రూపొందిస్తున్న రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లు ముసాయిదా, చట్టంగా మారితే, పై నిబంధనలు అమలులోకి వచ్చినట్లే. రవాణా వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టనున్న ఈ బిల్లు, దేశంలో నానాటికీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయనుంది. భారీ జరిమానాలు విధించడం ద్వారా, సురక్షిత డ్రైవింగ్ దిశగా దేశీ డ్రైవర్లను మళ్లించేందుకు ఈమేర కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని కేంద్ర ఉపరితల రవాణా శాఖ చెబుతోంది.