: ముంబైలో తేలిన హైదరాబాద్ బాలికలు!


రామాంతపూర్ లోని సత్య నగర్ కు చెందిన ఇర్ఫాన్ బేగం, పాత రామాంతపూర్ కు చెందిన ఫాతిమా బేగంలు స్నేహితులు. ఒకే పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో, ఆందోళన చెందిన విద్యార్థినుల తల్లిదండ్రులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల అదృశ్యంపై పోలీసులు దర్యాప్తులోకి దిగారో లేదో... ఆదివారం ఉదయం బాలికలు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. హైదరాబాద్ నుంచి తమను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి, ముంబై తీసుకొచ్చారని, ప్రస్తుతం తాము ముంబైలో ఉన్నామని తెలిపారు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేసిన బాలికల తల్లిదండ్రులు, తమ పిల్లలను హైదరాబాద్ రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు బాలికలను క్షేమంగా హైదరాబాద్ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉదంతంలో బాలికలు కిడ్నాప్ నకు గురయ్యారా? లేక, ఆకతాయి చేష్టల్లో భాగంగా వారే వెళ్లారా? అన్న విషయం బాలికలు ఇక్కడికి వచ్చాక కాని తెలియదు.

  • Loading...

More Telugu News