: మలాలాపై దాడి చేసిన ఉగ్రవాదుల అరెస్టు: పాక్ ఆర్మీ
పాకిస్థాన్ యువ ఉద్యమకారిణి మలాలా యూసఫ్ జాయ్ పై దాడి చేసిన పదిమంది తాలిబాన్ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ఆ దేశ ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదులపై దాడిలో భాగంగా పోలీసులు, నిఘా సంస్థలు, సైన్యం జరిపిన ఆపరేషన్ లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు మేజర్ జనరల్ అసిం సలీమ్ బాజ్వా వెల్లడించారు. 2012 అక్టోబర్ లో వాయవ్య స్వాత్ లోయలో మలాలపై తెహ్రీక్ ఇ-తాలిబాన్ పాకిస్తాన్ ముష్కరులు తలపై కాల్చారు. అదే సమయంలో ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. అనంతరం మలాలాకు లండన్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స జరగగా అక్కడే కోలుకుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వచ్చిన పాప్యులారిటీతో మలాల నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ అయింది. అనంతరం తన జీవితచరిత్రను విడుదల చేసిన ఆమె తల్లిదండ్రులతో కలసి ప్రస్తుతం బర్మింగ్ హామ్ లో ఉంటూ బాలికల విద్య కోసం పోరాడుతోంది.