: 'మేరీ కోమ్' చిత్రం మణిపూర్ లో రిలీజ్ కాకపోవడం బాధించింది: ప్రియాంకా చోప్రా
'మేరీ కోమ్' చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకోవడంపై నటి ప్రియాంక చోప్రా సంతోషం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఈ సినిమా మణిపూర్ (బాక్సర్ మేరీ కోమ్ సొంత రాష్ట్రం) లో విడుదల కాకపోవడం, అక్కడి ప్రజలు ఆ స్ఫూర్తిదాయక చిత్రాన్ని చూడలేకపోవడం బాధ కలిగించిందని తెలిపింది. మణిపురి విలువలకు విరుద్ధంగా బాలీవుడ్ వెళుతుందన్న కారణంతో 2000 సెప్టెంబర్ లో వేర్పాటువాద తీవ్రవాద గ్రూపు రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ హిందీ చిత్రాలపై అక్కడ నిషేధం విధించింది. ఈ మేరకు 'పీసీ' పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మణిపూర్లో చిత్రం రిలీజ్ కాకపోవడంపై చాలా భాధగా ఉంది. మేరీ కోమ్ కూడా దీనిపై ప్రభుత్వ అధికారులతో మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది. నా సినిమాను మణిపూర్ ప్రజలు చూడకపోవడంపై ఆవేదన చెందుతున్నా" అని పేర్కొంది.