: పేలుడు పదార్థాల సూట్ కేసును ఎయిర్ పోర్టులో మర్చిపోయిన పోలీసాఫీసర్
ఆస్ట్రేలియాలో ఓ పోలీస్ అధికారి విమానాశ్రయంలో పేలుడు పదార్థాలతో కూడిన సూట్ కేసును వదిలేసి వెళ్ళాడు. నాలుగు వారాల తర్వాత ఓ ప్రయాణికురాలు దాన్ని గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సిడ్నీ ఎయిర్ పోర్టులో జరిగిందీ ఘటన. పోలీసు జాగిలాలకు విమానాశ్రయాల్లో పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను పసిగట్టడం ఎలాగో శిక్షణ ఇస్తుంటారు. అందుకోసం ఆ కుక్కలను ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చి, అక్కడ కొన్ని పేలుడు పదార్థాలను ఉంచుతారు. అప్పుడు వాటిని పసిగట్టడం ఎలాగో నేర్పుతారు. అలా శిక్షణ ఇచ్చే క్రమంలో... సదరు పోలీసు అధికారి పేలుడు పదార్థాలు ఉన్న సూట్ కేసును అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ సూట్ కేసు అనుమానాస్పదంగా కనిపించడంతో ఓ ప్రయాణికురాలు అధికారులకు సమాచారమిచ్చింది. పరిశీలించి చూడగా, అందులో, 230 గ్రాముల ప్లాస్టిక్ పేలుడు పదార్థం దర్శనమిచ్చింది. దీనిపై విచారణ జరిపి కారకుడైన అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫెడరల్ పోలీస్ సిడ్నీ ఎయిర్ పోర్ట్ విభాగం కమాండర్ వేన్ బుకార్న్ తెలిపారు.