: అజ్మల్ కు షాకిచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు


బౌలింగ్ యాక్షన్ సరిగా లేని కారణంగా ఐసీసీ సస్పెన్షన్ వేటుకు గురైన పాకిస్థాన్ బౌలర్ సయీద్ అజ్మల్ కు సొంత బోర్డు షాకిచ్చింది. అజ్మల్ బౌలింగ్ అక్రమమంటూ ఐసీసీ మంగళవారం నాడు సస్పెన్షన్ నిర్ణయాన్ని ప్రకటించగా, ఆ నిర్ణయాన్ని తాము తప్పక సవాల్ చేస్తామంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ వెంటనే ప్రకటించింది. ఏమైందోగానీ, పీసీబీ నేడు మాట మార్చింది. ఐసీసీ నిర్ణయంపై తాము అప్పీల్ చేయబోవడం లేదని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడాలని కలలుగంటున్న అజ్మల్ కు పీసీబీ నిర్ణయం తీవ్ర నిరాశ కలిగించేదే. ఐసీసీ వేటు ఎదుర్కొన్న ఆటగాళ్ళు ఆయా దేశాల క్రికెట్ బోర్డుల పర్యవేక్షణలో దేశవాళీ క్రికెట్ ఆడవచ్చు. ఇప్పుడు, అజ్మల్ కూడా దేశవాళీ బాట పట్టక తప్పదు. దీనిపై, షహర్యార్ ఖాన్ మాట్లాడుతూ, పాక్ దేశవాళీ క్రికెట్లో కనీసం 35 మంది బౌలర్లు, ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లు, బౌలింగ్ తీరు సరిగాలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కలిగిన ఈ బౌలర్ల వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు, శాశ్వతంగా వారి సమస్యను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఖాన్ పేర్కొన్నారు. ఇక, అజ్మల్ పై వేటు వెనుక ఎలాంటి కుట్రలేదని అన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ బౌలర్లు కూడా ఇలానే వేటుకు గురయ్యారని, ఐసీసీ ఈ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News