: ఆసియా క్రీడల నుంచి తప్పుకున్న గుత్తా జ్వాల
తెలుగుతేజం గుత్తా జ్వాల (31) ఆసియా క్రీడల నుంచి వైదొలగింది. కుడి మోకాలి నొప్పి వేధిస్తుండడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. మోకాలి గాయానికి రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు జ్వాలకు సూచించారు. దీంతో, ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ నుంచి వైదొలగక తప్పలేదు. దీనిపై జ్వాల మాట్లాడుతూ, "ఆసియా క్రీడల కోసం శిక్షణ ఆరంభించాక మోకాలి నొప్పి మొదలైంది. డాక్టర్లను కలిస్తే 10-12 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, తప్పుకోవడం మినహా మరో మార్గం కనిపించలేదు. చాలా బాధగా ఉంది. నా కెరీర్లో గాయం కారణంగా ఓ టోర్నీ నుంచి మునుపెన్నడూ తప్పుకోలేదు" అని వివరించింది. కాగా, ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు దక్షిణకొరియాలోని ఇంచియాన్ వేదికగా జరగనున్నాయి.