: యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడిన 'ఆసియా వీరుడు'
టెన్నిస్ చరిత్రలో గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్ చేరిన తొలి ఆసియా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన కియి నిషికొరి (జపాన్) యూఎస్ ఓపెన్ లో చివరికి 'రన్నరప్' తో సరిపెట్టుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో నిషికొరి సెర్బియా క్రీడాకారుడు మారిన్ సిలిక్ (క్రొయేషియా) చేతిలో 3-6, 3-6, 3-6తో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు. ఆజానుబాహుడైన సిలిక్ ధాటికి నిషికొరి ఏ దశలోనూ నిలవలేకపోయాడు. క్రొయేషియా ఆటగాడి భారీ సర్వీసులకు, పిడుగుల్లాంటి ఫోర్ హ్యాండ్ షాట్లకు నిషికొరి వద్ద సమాధానమే లేకపోయింది. ఇక, తన సర్వీసులను సైతం నిలబెట్టుకోవడంలో ఈ జపాన్ క్రీడాకారుడు విఫలమయ్యాడు. ఐదు సార్లు తన సర్వీసులను కోల్పోయి, చివరికి మ్యాచ్ ను చేజార్చుకున్నాడు. అంతకుముందు, సెమీస్ లో వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ ను చిత్తుచేయడంతో నిషికొరిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, సిలిక్ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ టైటిల్ ఎగరేసుకెళ్ళాడు. కాగా, ఓ అనామకుడు యూఎస్ ఓపెన్ లో టైటిల్ నెగ్గడం 1968 తర్వాత ఇదే ప్రథమం. 1994లో అండ్రూ అగస్సీ, 2002లో పీట్ సంప్రాస్ లు లోయర్ సీడెడ్ ఆటగాళ్ళుగా బరిలో దిగి టైటిల్ నెగ్గినా, అప్పటికే వాళ్ళు స్టార్లు. అయితే, ర్యాంకింగ్ పడిపోవడంతో లోయెర్ సీడెడ్లుగా టోర్నీలో దిగారు. 2005 తర్వాత జోకోవిచ్, నడాల్, ఫెదరర్ లేకుండా యూఎస్ ఓపెన్ ఫైనల్ జరగడం ఇదే ప్రథమం.