: ప్రతి తొమ్మిది మంది ఢిల్లీ పోలీసుల్లో ఒకరు అవినీతి పరుడేనట!


ఇదేదో ఏ స్వచ్ఛంద సంస్థో, లేకపోతే పోలీసుల చేత చావు దెబ్బలు తిన్న వ్యక్తో చేసిన ఆరోపణ కాదు. సాక్షాత్తు ఆ శాఖలో కొత్తగా ఏర్పాటైన విజిలెన్స్ విభాగం తన సిబ్బందికి ఇచ్చిన కితాబు! నెలక్రితం ఏర్పాటైన ఈ విజిలెన్స్ సెల్ కు ఏకంగా 9,000 ఫిర్యాదులు అందాయి. అయితే వాటిలో కేవలం ఆరు కేసుల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం. ఇక కేసుల్లో పేర్లు చోటుచేసుకున్న పోలీసులు విధులకు దూరంగా ఉంటున్నారా అంటే, అలాంటిదేమీ లేదంటోంది విజిలెన్స్ సెల్. కొన్ని నెలల క్రితం ఓ సబ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ ఔషధాల వ్యాపారి నుంచి రూ. 40 వేలు లంచం డిమాండ్ చేయడంతో కేసులో ఇరుక్కున్నారు. అయితే నేటికీ వారు నిరాఘాటంగా విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఢిల్లీ పోలీసు శాఖలో వేళ్లూనుకున్న అవినీతిని కడిగిపారేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల నడుం బిగించారు. ఎక్కడైనా పోలీసు సిబ్బంది అవినీతికి పాల్పడుతుంటే 9910641064 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీనికి ఢిల్లీ వాసుల నుంచి విశేష స్పందన లభించింది. ఒక్క నెలలోనే 9,000 ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే విజిలెన్స్ శాఖ మాత్రం ఆరు ఫిర్యాదుల్లో మాత్రమే కేసులు నమోదు చేసింది. అంటే, పోలీసు శాఖలో అవినీతిని కడిగిపారేస్తుందనుకున్న విజిలెన్స్ శాఖ కూడా సఫలం కావడం అసాధ్యమేనన్న మాట!

  • Loading...

More Telugu News