: ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన ఆదివారం మధ్యాహ్నం తర్వాత ముగిసింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్, ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ తదితరులతో భేటీ అయ్యారు. తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి, పెండింగ్ ప్రాజెక్టులు, విద్యుత్ కేటాయింపులు తదితర అంశాలను కేసీఆర్ చర్చించారు. ప్రకాశ్ జవదేకర్ తో అరగంట పాటు జరిగిన చర్చల్లో తెలంగాణలో నిలిచిపోయిన పలు వార్తా చానెళ్ల ప్రసారాల విషయం ప్రస్తావనకు వచ్చింది. అయితే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించరాదన్న కేంద్ర మంత్రి ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్, ఆ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఎంతమాత్రం లేదని చెప్పినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటనను ముగించుకున్న కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యారు.