: చనిపోయిన చెన్నై మహిళ ఐదుగురికి పునర్జన్మనిచ్చింది!


ఓ ప్రమాదంలో గాయపడ్డ చెన్నై మహిళ, తాను మృతి చెందినా, మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించింది. ఎలాగంటే, తన అవయవాలను దానం చేయడం ద్వారా. చెన్నైలోని పుజ్జల్ ప్రాంతానికి చెందిన దంపతులు ప్రయాణిస్తున్న కారు గురువారం రాత్రి భారీ వర్షాల్లో చిక్కుకుంది. అంతేకాక కారు బోల్తా పడింది. దీంతో మహిళ తలకు బలమైన గాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరిన ఆమెను గ్లోబల్ హెల్త్ సిటీ ఆస్పత్రికి తరలించారు. వివిధ రకాల పరీక్షలు చేసిన వైద్యులు ఆమెను ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించారు. ఇదే సమయంలో ఆమె అవయవాలను దానం చేయడం ద్వారా ఇతరులకు ప్రాణ దానం చేసినట్లవుతుందన్న వైద్యుల సలహాకు కుటుంబ సభ్యులు పచ్చజెండా ఊపారు. అంతే, బ్రెయిన్ డెడ్ మహిళ శరీరం నుంచి గుండె, కాలేయం, కిడ్నీలు, కళ్లను తీసిన వైద్యులు వాటిని భద్రపరిచారు. అపొలో ఆస్పత్రిలో గుండె అవసరమైన 58 ఏళ్ల మహిళకు గుండెను అమర్చారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోంది. లివర్ తో పాటు ఓ కిడ్నీని వైద్యులు కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగుల కోసం తరలించారు. మరో కిడ్నీని గ్లోబల్ ఆస్పత్రిలోని ఓ రోగికి అమర్చారు. బ్రెయిన్ డెడ్ మహిళ కళ్లను కూడా భద్రపరచిన వైద్యులు అవసరమైనవారికి అందించేందుకు సిద్ధం చేశారు.

  • Loading...

More Telugu News