: తెలంగాణ అంతటా భారీ వర్షాలు
తెలంగాణలోని రంగారెడ్డి, ఆదిలాబాదు, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాంకిడి మండలంలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిక్లి వాగు పొంగి కనర్గాం, చోపన్ గూడ పంచాయతీల పరిధిలోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. సిర్పూర్ లో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంథనిలో 19, మంచిర్యాలలో 16, రామగుండంలో 15, చెన్నూరు, కాళేశ్వరం, ఆసిఫాబాదులో 13, పేరూరులో 12 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. వెంకటాపురం, భూపాలపల్లిలో 11, గోల్కొండ, గోవిందరావుపేటలో 10, లక్సెట్టిపేటలో 9, పరకాల, ఉట్నూరులో 8, ఆదిలాబాద్, ధర్మపురి, సారంగపూర్, తాండూరు, ములుగులో 7 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డు అయింది.