: ఐయామ్ వెరీ సారీ... క్షమించు మిత్రమా!
‘క్షమించు’ అన్న ఒక్క మాటతో... మనసు కుదుటపడుతుంది. అంతేకాదు, మన్నించిన వారు ఆనందపడతారు. అందుకే సినీ రచయిత సిరివెన్నెల ‘ఐయామ్ వెరీ సారీ... అన్నాగా వందోసారి... సరదాగా నవ్వేసెయ్ ఓ సారీ’ అంటూ పాట రాశారు. ఇవాళ ‘ప్రపంచ క్షమాగుణ దినం’ సందర్భంగా ఒక్కసారి 'సారీ' చెబితే తప్పేముంది? క్షమించడం... క్షమించమని కోరడం... అనేవి ఎదుటివారి కంటే ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఎక్కువ సంతృప్తినిస్తాయి. ఏదైనా తన వల్ల పొరపాటు జరిగితే, అవతలి వ్యక్తి మనసు గాయపడితే... మరేం ఆలోచించకుండా సారీ చెప్పేయండి. దాంతో అపరాధ భావం నుంచి బయటపడొచ్చు. లేదంటే, అది ఎన్ని రోజులైనా మానసికంగా వేధిస్తుంది. పిల్లలు, ప్రేమికులు, భార్యాభర్తలు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, తోటి ప్రయాణికులు ఎవరైనా సరే పొరపాటు చేసినప్పుడు సారీ చెప్పేస్తే సరి. చెప్పినంత సులువు కాదనుకోండి.... సాధనతో క్రమంగా అలవాటు చేసుకోవచ్చు.