: సెలబ్రిటీల వ్యక్తిగత ఫోటోలను హ్యాక్ చేయవద్దు: నటి పరిణీతి
తాము అభిమానించే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందికి ఉండడం సబబేనని బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పేర్కొంది. అయితే, వారి గురించిన సమాచారాన్ని, ఫోటోలను హ్యాక్ చేసి మార్ఫ్ చేయడం మాత్రం సమంజసం కాదంటోంది. ఇటీవల కొంతమంది హాలీవుడ్ తారలకు సంబంధించిన నగ్న చిత్రాలు ఆన్ లైన్ లో హ్యాకర్ల ద్వారా బయటికొచ్చాయి. దానిపై ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో పరిణీతి స్పందిస్తూ, "ఈ అంశంపై చర్చించడం అంత అవసరమని నేననుకోవడంలేదు. ఓ నటిగా నా వ్యక్తిగత జీవితం గురించి మీరు తెలుసుకోవాలనడం మంచిదే. నేనూ ఒకరికి ఫ్యాన్ అయి ఉంటే, వారి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తాను" అని పరిణీతి చెప్పుకొచ్చింది. అయితే, ఇక్కడో ఉదాహరణను చెబుతూ, నటుడు బ్రాడ్ పిట్ ఎవరితో డేటింగ్ చేస్తున్నాడు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడోనన్న విషయాలను తనకు తెలుసుకోవాలనుంటుందని చెప్పింది. కానీ, అతని నగ్న చిత్రాలను లీక్ చేయడం మంచిది కాదని, అసలు దానిపై మాట్లాడనని చెప్పింది.