: అబ్బాయిగా పారిపోయి... అమ్మాయిగా తిరిగి వచ్చాడు!


పరిశోధనలు, పరిజ్ఞానం జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తున్నాయనడానికి నిదర్శనంగా ఓ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. యువకుడిగా ఇంటినుంచి పారిపోయిన వ్యక్తి పది నెలల తరువాత యువతిలా రావడంతో కుటుంబ సభ్యులు అందోళన చెందుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లికి చెందిన లకావత్ శశికళ, రామచంద్రం దంపతుల రెండో సంతానం లకావత్ సురేశ్. ఈ కుర్రాడికి తను ఆడపిల్లననే భావన బలంగా ఉండేది. అతను వద్దంటున్నా కుటుంబసభ్యులు బలవంతంగా రెండేళ్లక్రితం అదే మండలం రాచర్ల గుండారానికి చెందిన ఓ యువతితో వివాహం చేశారు. వీరి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది. ఈ క్రమంలో సురేశ్‌ను అతడి అన్న రాజు కొట్టాడు. దీంతో గతేడాది నవంబర్ 21న ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో తన కుమారుడు కనిపించడం లేదని మరుసటి రోజు శశికళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సురేశ్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం సురేష్ నేరుగా ముంబై వెళ్లి అక్కడ లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని మహిళగా మారి లతగా పేరు మార్చుకున్నాడు. వారం క్రితం మరో హిజ్రాతో కలిసి వేములవాడ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అతని తల్లి కూడా వేరే కేసు నిమిత్తం సరిగ్గా అక్కడికే వచ్చింది. తల్లిని చూసిన సురేష్ (లత) పలకరించాడు. మాయమైన కుమారుడు అమ్మాయిగా కనిపించడంతో ఆమె ఆందోళనకు గురైంది. భర్త వచ్చాడని తెలుసుకున్న సురేష్ భార్య పోలీస్ స్టేషన్ కు చేరుకోగా, అక్కడ భర్త స్థానంలో మగువ దర్శనమివ్వడంతో కన్నీటి పర్యంతమైంది.

  • Loading...

More Telugu News