: ప్రియురాలిని విసిగించి... జైలు పాలయ్యాడు!
ఫ్రాన్స్ కు చెందిన ఓ వ్యక్తి తన మాజీ ప్రేయసి స్పందన కోసం పట్టువిడవకుండా ప్రయత్నించి, చివరికి జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... దక్షిణ ఫ్రాన్స్ లోని రోనే ప్రాంతానికి చెందిన ఈ ఫ్రెంచి కుర్రాడికి ప్రేయసి కొన్నేళ్ళ క్రితం గుడ్ బై చెప్పింది. 2011లో వారి సంబంధం తెగిపోయింది. అప్పటి నుంచి ఆమెకు అతగాడు ఎన్నిసార్లు ఫోన్, ఎస్సెమ్మెస్ చేశాడో తెలుసా..? అక్షరాలా 21,807 సార్లు. ఇవన్నీ పది నెలల వ్యవధిలోనే చేశాడు. దీంతో, ఆ యువతి విసుగెత్తిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతగాడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం స్వల్ప జైలుశిక్ష విధించింది. తామిద్దరం ఓ అపార్ట్ మెంట్లో కలసి ఉన్నప్పుడు... ఆమె కోసం తాను ఇంటిపని కూడా చేశానని సదరు 'గజినీ' చెప్పాడు. అందుకు పరిహారం చెల్లించాలని ఆమెను కోరానని తెలిపాడు. ఆ డబ్బు ఇచ్చేంతవరకైనా ఫోన్ ద్వారా ఆమెతో మాట్లాడవచ్చన్నది తన ఆలోచన అని వెల్లడించాడు. కనీసం, 'థాంక్ యూ' అని చెప్పినా చాలని భావించానని, అందుకే, ఆమెకు అన్నిసార్లు ఫోన్, ఎస్సెమ్మెస్ చేశానని వివరించాడు. ఈ కేసు విచారించిన కోర్టు, ఇకపై ఆ యువతిని ఏ విధంగానూ వేధించరాదని స్పష్టం చేసింది. అతనికి మానసిక చికిత్స అందించాలని అధికారులను ఆదేశించింది.