: మామిడికాయ దొంగిలించాడని కొట్టి చంపాడు!


ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మామిడికాయ దొంగిలించాడని ఓ బాలుడిని కొట్టి చంపాడో వ్యక్తి. ఈశాన్య ఢిల్లీలోని న్యూ సీమాపురిలో జరిగిందీ ఘటన. పద్నాలుగేళ్ళ బాలుడు పార్కులో ఆడుకుంటుండగా, అంతలో ఓ మామిడికాయల విక్రేత కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి, మామిడికాయ ఎందుకు దొంగిలించావంటూ ఆ బాలుడిని చితకబాదాడు. దీంతో, ఆ టీనేజర్ ప్రాణాలు విడిచాడు. మామిడికాయల విక్రేత ఇనుపరాడ్డుతో తలపై కొట్టడంవల్లే తమ పిల్లవాడు మరణించాడని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై, మృతుడి సోదరుడు షేక్ షహబుద్దీన్ మాట్లాడుతూ, "మేము పార్కులో ఆడుకుంటుండగా, మామిడికాయలు అమ్ముకునే వ్యక్తి వచ్చి మా సోదరుడిని కొట్టడం ఆరంభించాడు. అడ్డువెళ్ళిన నాపైనా ఇనుపరాడ్డుతో దాడి చేశాడు" అని వివరించాడు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన కరీం షా అనే వ్యక్తి కూడా, మామిడికాయల విక్రేత చర్య దారుణమని అభిప్రాయపడ్డాడు. బాలుడిని నిర్దాక్షిణ్యంగా కొట్టాడని తెలిపాడు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.

  • Loading...

More Telugu News