: ఎట్టకేలకు సజావుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
నిత్యం అరుపులు, కేకలు. వాదాలు, ప్రతివాదాలు. ఆరోపణలు, ప్రత్యారోపణలు. సవాళ్లు, ప్రతిసవాళ్లు. ఒకానొక దశలో దాడి, ప్రతి దాడి. ఎడతెగని వాగ్యుద్ధం. సభ్యుల సస్పెన్షన్లు. వాకౌట్లు. రోజూ స్పీకర్ పోడియం ముందు సభ్యుల బారులు. ఇదీ నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తీరు. అటు సభ మొదలు కావడం, ఇటు వాయిదా పడటం రివాజుగా మారింది. అయితే శుక్రవారం సభ ప్రారంభం కాగానే నియమాలకు అనుగుణంగా స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఏ ఒక్క సభ్యుడు గొంతెత్తలేదు. ప్రశాంతంగా ఆయా ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలిచ్చారు. మరిన్ని సందేహాలను వ్యక్తం చేసిన సభ్యులు తమ అనుబంధ ప్రశ్నలను సంధించారు. వాటికీ మంత్రులు సమాధానం చెప్పారు. ఇదీ శుక్రవారం సభ ప్రారంభం కాగానే కనిపించిన దృశ్యం. నిన్నటిదాకా అరుపులు, కేకలతో రణరంగాన్ని తలపించిన సభ, రాజధాని విజయవాడలోనే అన్న అంశం తేలిపోవడంతో సభ్యులు నిశ్శబ్ధం వహించారు. అంతేనా, సభలో అధికార, విపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు జోకులేసుకుని మరీ మనసారా నవ్వేసుకున్నారు.