: తగ్గిన కూరగాయల ధరలు... ఊరట చెందిన పేద, మధ్యతరగతి ప్రజలు


హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూరగాయల ధరలు క్రమంగా తగ్గుతుండడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఊరట చెందుతున్నారు. నెల క్రితం రూ.50 పలికిన కిలో టమోట ప్రస్తుతం రూ.20కి దిగి వచ్చింది. ఆగస్ట్ లో వర్షాలు కురవడంతో కూరగాయల దిగుబడి కూడా నెమ్మదిగా పెరగటం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం. ఈ ఏడాది ఆరంభం నుంచి కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా జూన్ నుంచి ఆగస్ట్ మధ్య కూరగాయల ధరలు పతాక స్థాయికి చేరుకున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా వర్షాలు కురవకపోవడంతో రైతులు సాగుచేసిన పంటలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. దీంతో పంటలు ఎండిపోవడంతో మార్కెట్లో కూరగాయల కొరత ఏర్పడింది. కూరగాయల ఉత్పత్తి తగ్గడంతో పాటు... కొంతమంది వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్ వల్ల కూడా కూరగాయలు ధరలు ఆకాశాన్నంటాయి. ఒకానొక సమయంలో కిలో టమోట రూ.80కి చేరుకుంది. పచ్చిమిర్చి కిలో రూ.100, బీన్స్ రూ.120తో పాటు కూరగాయలు ఏవైనా కిలో రూ.30 పైనే ఉండేవి. అయితే, ప్రస్తుతం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. మెహిదీపట్నం రైతుబజార్, గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లకి కూరగాయలు భారీగా వస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, శంషాబాద్, షాద్‌నగర్ నుంచి క్రమంగా కూరగాయల దిగుమతి పెరుగుతుంది. మరో రెండు వారాల్లో ధరలు ఇంకా తగ్గే అవకాశాలున్నాయని కూరగాయల వ్యాపారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News