: ఆల్ ఖైదా భారత శాఖ ప్రారంభం
ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని చాటుకునేందుకు విధ్వంసాలకు తెగబడ్డ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా, తాజాగా భారత శాఖను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఆల్ ఖైదా చీఫ్ అయమాన్ ఆల్ జవహరీ ప్రసంగంతో కూడిన 50 నిమిషాల వీడియోను విడుదల చేసిన ఉగ్రవాద సంస్థ, భారత భూభాగంలో అన్యాయానికి గురవుతున్న ముస్లింలకు బాసటగా నిలిచేందుకే ఈ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆల్ ఖైదాలో పాక్ షరియా కమిటీ చీఫ్ గా వ్యవహరిస్తున్న ఆసిమ్ ఉమర్, భారత విభాగం చీఫ్ గా కొనసాగుతారని జవహరి ప్రకటించారు. ఒసామా బిన్ లాడెన్ మరణించిన నాటి నుంచి జవహరి, ఆ సంస్థ బాధ్యతలు భుజానేసుకున్నాడు. లాడెన్ బతికున్నప్పుడు కూడా ఆయనకు ముఖ్య అనుచరుడిగా వ్యవహరించిన జవహరి, కరడుగట్టిన ఉగ్రవాదిగా పేరుగాంచారు. బర్మా, కాశ్మీర్, గుజరాత్, బంగ్లాదేశ్, అహ్మదాబాద్, అసోంలలోని ముస్లింలను రక్షించేందుకే భారత ఉప ఖండంలో శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ వీడియోలో అతడు ప్రకటించారు. ఈ శాఖను ఏర్పాటు చేసేందుకు తమకు రెండేళ్ల సమయం పట్టిందని అతడు చెప్పాడు. భారత్ లో షరియా చట్టాన్ని అమలు చేయడంతో పాటు ఆక్రమణలకు గురైన ముస్లింల భూములను తిరిగి స్వాధీనపరచుకోవడమే తమ కొత్త శాఖ లక్ష్యమని జవహరి పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే తమిళనాడు, మహారాష్ట్రల నుంచి ఇప్పటికే ఇరాకీ మిలిటెంట్ గ్రూపులో పెద్ద సంఖ్యలో యువత చేరుతున్న నేపథ్యంలో ఆల్ ఖైదా తాజా ప్రకటన మరింత ఆందోళన కగిలించేదే!